వైకాపా అధినేత రామోజీ రావు ను ఎందుకు కలిసారు అనేది ఇంకా బయటకు రాకున్నా రాజకీయంగా ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. అమరావతి శంకుస్థాపనకి వచ్చిన మోది మట్టి నీళ్ళు తప్ప ఎపి ప్రజలకి ఇంకేమి ఇవ్వకపోవడం వెనుక కూడా ఏదో బలమైన కారణం ఉందని అనుమానిస్తున్నారు. అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలని కలిపి చూస్తే మనకి ఓ పిక్చర్ కనిపిస్తుంది. “ఎపి లో బిజెపి సొంతంగా అధికారం సాధించడం” అనే అంశం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. వైకాపా బిజెపి లో ఎందుకు విలీనం అవుతుందో తెలుసుకునే ముందు, ఎపి లో బిజేపి పరిస్థితి ఒక సారి చూద్దాం.

రాష్ట్రం లో సొంతంగా అధికారం లోకి రావాలనే ఆశ అయితే బిజెపి కి ఉంది కాని, అందుకు తగ్గ కేడర్, లీడర్స్ బిజెపి కి లేరు. బిజెపి లో ఉన్న నాయకులు గ్రహాల లాంటి వాళ్ళే కాని స్వయం ప్రకాశం ఉన్న స్టార్స్ కాదు. హరిబాబు, వెంకయ్య, పురంద్రీశ్వరి, కన్నా, కావూరి, కామినేని, గంగరాజు ఇలా అందరూ తెరవెనుక రాజకీయాలు చేయగల సమర్థులే కాని, పార్టీ ని లీడ్ చేసే సత్తా ఉన్న వాళ్ళు కాదు. అందుకే బిజెపి ఒక పొలిటికల్ స్టార్ కోసం చూస్తోంది. ఆ దిశగా బిజెపి మొదటి చాయిస్ పవన్ కల్యాణ్. పవన్ ను బిజెపి లో కలిపేసుకుని కాపుల ఓట్లు, యువత ఓట్లు తెచ్చేసుకుని రాష్ట్రం లో అధికారం లోకి రావచ్చు అనేది బిజెపి అగ్రనాయకత్వం ఆలోచన. అయితే పవన్ అయోమయ వైఖరి కారణంగా ఇది ముందుకుపోవడం లేదు. జనసేన పార్టీని బిజెపి లో విలీనం చేస్తే తాను కూడా తన అన్న లాగా చేసినట్లు అవుతుంది అని పవన్ ఆలోచిస్తున్నాడు. రాజకీయాల్లో పవన్ కి ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయి, వాటిని వదిలేసి బిజిపి లో చేరడం పవన్ కి ఇష్టం లేదు. అందుకే ఆల్టర్నేట్ కోసం బిజెపి వెదుకుతోంది.

చిరంజీవి ని బిజెపి లో చేర్చుకుంటే, ఆటోమాటిక్ గా పవన్ సపోర్ట్ కూడా తమకే ఉంటుందని బిజెపి ఆలోచిస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి పార్టీలో చేరినా పెద్దగా పార్టీ కి ఒరిగేది ఏమీ ఉండదని బిజెపి అధినాయకత్వం అంచనా. అందుకే చిరంజీవి, పవన్ కల్యాణ్ కాకుండా ఇంకెవరు తమని ఆదుకుని గట్టెక్కిస్తారా అని బిజెపి చూస్తోంది. బిజెపి చూపి ఇప్పుడు జగన్ మీద పడింది. చిరంజీవిని, జగన్ ని తమ పార్టీలో చేర్చుకుంటే ఎపి లో అధికారం పక్కా అని స్కెచ్ లు వేస్తున్నారు బిజెపి నాయకులు. దీనికి ఆధారాలు ఏమిటంటే..


“మోది ఆఫీసు నుండి తరచూ ఫోన్ కాల్స్ వెళ్ళే వ్యక్తుల లిస్టు లో గత నెల రోజులలో జగన్ పేరు చేరింది” అని జూలై 20న rediff.com పోర్టల్ పేర్కొనడం.
మోదికి అత్యంత ఆప్తుడుగా మారిన రామోజీరావుని జగన్ కలవడం.
జగన్ కేసుల విషయం లో సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు (ఈడి) నిదానంగా వ్యవహరిస్తుండటం.
జగన్ పత్రిక సాక్షిలో గత రెండు నెలలుగా మోది అనుకూల వార్తలు ఎక్కువగా వస్తుండటం.
ఈ నాలుగు అంశాల ఆధారంగా బిజెపి, జగన్ మధ్య ఏదో జరుగుతోందని మనం భావించవచ్చు.

జగన్ కి బిజెపి తో కలవడం ఎందుకు అవసరం?

జగన్ కి తన మీద ఉన్న కేసులని వదిలించుకోవడం అత్యవసరం. ఒక్క కేసులో దోషిగా తేలినా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతే తనకి రాజకీయ భవిష్యత్తు ప్రమాదం లో పడుతుంది.
ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడపడం అంత ఈజీ కాదు. ఇప్పటికే పార్టీ ని నడపడం ఆర్థికంగా జగన్ కి భారంగా ఉంది. అంటే పార్టీని నడిపడానికి తన దగ్గర డబ్బుల్లేక కాదు,ఖర్చు పెట్టడానికి మనసు రాక.
జగన్ వెనుక ఉన్న కేడర్ కూడా ఎక్కువభాగం జగన్ అధికారం లోకి రావడం పక్కా అని నమ్మి ఆయన వెనుక చేరిన వాళ్ళే కానీ, జగన్ సిద్దాంతాలు(?) నమ్మి వచ్చిన వాళ్ళు కాదు, ఈ కేడర్ ని నిలుపుకోవాలి అంటే ఎక్కడో ఒక చోట అధికార పార్టీ అండ ఉండాలి.
జగన్ కి మొన్న వచ్చిన ఓట్లలో అధిక శాతం తన తండ్రి వైఎస్ మీద ఉన్న సానుభూతి ఆధారంగా వచ్చినవి. ఈ సానుభూతి వచ్చే ఎన్నికల నాటికి ఉండదు. జగన్ ఇలాగే ఉంటే పోయినసారి వచ్చిన ఓట్లలో సగం కూడా రావు. కాబట్టి జగన్ ఏదో ఒకటి చేయాలి.

సో, జగన్ ఇలాగే ఉంటె, డబ్బు ఖర్చు అవుతుంది, కేడర్ జారిపోతుంది, కేసులు మెడకి చుట్టుకుంటాయి, పైగా ఓట్లు కూడా తగ్గిపోతాయి, అందుకే జగన్ కి బిజెపి సపోర్ట్ చాలా కీలకం.

టిడిపి తో బిజెపి కి సమస్య ఏమిటి?

బిజెపి టిడిపి ని నమ్మకమైన స్నేహితుడిగా భావించడం లేదు. గత ఎన్నికల్లో అవసరార్థం పొత్తు పెట్టుకున్నారు కానీ, చంద్రబాబు బలపడితే, తన కొడుక్కి రాష్ట్రాన్ని అప్పగించి, తను జాతీయ రాజకీయాల్లోకి వస్తాడని థర్డ్ ఫ్రంట్ అనో, సెక్యులర్ ఫ్రంట్ అనో ఏదో ఒక హడావిడి చేసి బిజెపి వ్యతిరేక శక్తులని కూడగడతాడని బిజెపి అనుమానిస్తోంది. అందుకే చంద్రబాబు కాళ్ళరిగేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా కేంద్రం పైసా విదల్చడం లేదు. ( ఇదే విషయాన్ని, తెలుగుదేశం పక్షపాతిగా ముద్రపడ్డ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తన కొత్త పలుకులు లో ప్రస్తావించారు.)

బిజెపి స్కెచ్ ఏమిటంటే..

జగన్, చిరంజీవి లను పార్టీలోకి చేర్చుకుని రాష్ట్రం లో బలమైన రెడ్డి, కాపు వర్గాలని తమవైపుకి తిప్పుకోవాలి. జగన్ ద్వారా కేంద్రం పై వత్తిడి పెంచి ఏపి కి ప్యాకేజి కాని, ప్రత్యేక హోదా కాని ఇప్పించాలి. జగన్ పై ఉన్న కేసులని నీరు గార్చాలి. ఫైనల్ గా రెడ్డి, కాపు కులాల అండతో ఏపి లో అధికారం లోకి రావాలి. ఇదీ బిజెపి స్కెచ్. సో బిజెపి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, వైకాపా బిజెపి లో విలీనం కావడం ఖాయం గా కనిపిస్తోంది.

నోట్: ఈ విలీనానికి ప్రధానంగా ఉన్న అడ్డంకి ఏమిటంటే, వైకాపా కి క్రిష్టియన్, ముస్లిం మతస్తులు ప్రధాన ఓటు బ్యాంక్ గా ఉన్నారు. బిజెపి తో కలిస్తే వైకాపా కి ఈ వర్గాలు దూరం అవుతారనే భయం ఒకటి పార్టీ వర్గాల్లో ఉంది.
Next
Newer Post
Previous
This is the last post.

Popular Posts

 
Top